తల తిమురుబట్టిన నామిని కత


పచ్చనాకు సాక్షిగా కి పాతికేళ్ళు

ఎండలు గాసే ఈ భూమండలం మీద ఇంత తిమురు బట్టిన రచయిత ఇంకొకరు ఉంటారా?ఎంత తిమురంటే.. సినిమాల్లో ఎన్టీయార్‌, ఏఎన్నార్‌ మాదిరిగా ఈ సాహిత్యంలో రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు ల గొడవేందో అని రావిశాస్త్రి బతికుండగానే అనేంత తిమురు.మా బక్కమ్మకీ,కర్రెక్కకీ ఉండే స్థాయి గూడా సింగమనేని నారాయణకీ, కేతు విశ్వనాధరెడ్డికీ లేదనేంత తిమురు.మాల మాదిగల జీవితాన్ని రాస్తున్నానని చెప్పి , ఇంక్రెడిబుల్‌గాడెస్‌ అని పేరు పెట్టిన రచయిత రైతు రచయితే కాదన్నంత తిమురు.ఇంత తిమురు బట్టిన రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గాక ఇంకెవురు?
నామిని తిమురంతా ఆయన పాతికేళ్ళ కిందట రాసిన పచ్చనాకు సాక్షిగా..తో మొదలైంది. అప్పుడే గదా నామిన్ని నా ఏకలవ్య శిష్యుడు అని కారా మేస్టారు సొంతంగా ప్రకటించేసుకునింది. అయితే, మేధావులు మెచ్చుకునే యజ్ఙం, చావు కతల్లో చీమతలకాయలో మెదడంత జీవితం కూడా లేదని నామిని గట్టి నమ్మకం. ఆ రోజుల్లోనే గదా ఆంధ్రా గోర్కీ నామిని అని రంగనాయకమ్మ అచ్చేసి ఆంధ్ర దేశమ్మీదకి వొదిలింది. ఇక సినబ్బకతలనీ, మిట్టోరోడి కతలనీ, మునికన్నడి సేద్యమనీ, పాలపొదుగనీ, సుందరమ్మ కొడుకులనీ ఎడా పెడా విరుచుకుపడ్డాడు నామిని. ఆ జలపాతం కింద బాపు, ముళ్ళపూడి,.మో, యింకా ఎందరెందరో తడిచి తబ్బిబ్బయ్యారు. నమస్కారాలు పెట్టుకున్నారు. అట్లా పొర్లు దండాలు పెట్టుకున్న వాళ్ళలో నేనూ ఒకణ్ణి. తాజాగా సాకం నాగరాజ, దుర్గాప్రసాద్‌. అందుకే ఆయన పచ్చనాకు సాక్షిగా కి పాతికేళ్ళ పండగ చేద్దామని తెగ ఉత్సాహపడిపోతున్నారు. ఆయన కుటుంబానికి సాయం చేద్దామని ఆశపడుతున్నారు. ఈ సాయాన్ని కూడా ఎడం కంటితో ఎగతాళి చేయగల సాహసి నామిని అని పాపం వాళ్ళిద్దరికీ జనవరి తొమ్మిది తర్వాత తప్ప తెలీదు. సరే, ఇంత తిమురుబట్టిన రచయితతో కాసేపు మాట్లాడదామని తిరప్తి అన్నమయ్య సర్కిల్‌ దగ్గర్లో ఉండే నామిని ఇంటికి ఫోన్‌ చేసి వెళ్ళా. రాగి చెంబులో నీళ్లు.. గాజు గ్లాసులో మందు.. రా బ్బా అని లోపలికి పిలిచాడు. మా నాయన నాకిచ్చిన భూమిని గనుక అమ్ముకోకుండా ఉండి ఉంటే.. ఇప్పుడీ దరిద్రపు ఆత్మకథ మొదులు పెట్టి ఉండే వాణ్ణి కాదు . అని మార్క్‌ట్వైన్‌ తన ఆత్మకథ మొదులుబెడతాడు తెలుసా.. అన్నాడు నామిని అప్రస్తుతంగా. అవును మరి , మా అమ్మ చెప్పిన కతలు అని ఒక పుస్తకం రాసి 2001లో శివకాశికి పొయ్యి మూడు లక్షలు ఖర్చు పెట్టి లక్ష కాపీలు అచ్చేయించుకుని లారీ లోడు తెచ్చి ఇంటి నిండా కొండలా పోగేసుకున్న వాడు గదా మరి. ప్రభావతి పోరతా ఉంటే ఆ కొండని కరిగించేందుకు సైకిలు మీద ఊరూరా తిరిగి కార్పొరేట్‌ బడుల్లో మెడబట్టి గెంటించుకున్న అనుభవం అందరికీ వస్తుందా.. నామిని సుబ్రహ్మణ్యం నాయుడుకి తప్ప. -అప్పుడు మంగళం రోడ్లో అంకణం నాలుగు వేలు. ఒక ప్లాటు కొనుక్కోనుంటే ఇప్పుడు ఇరైఅయిదు లక్షలు. బిడ్డల చదువులకి అక్కరకొచ్చుణ్ణు గదా- అని ప్రభావతి నసపెడతాదంటే పెట్టదా. మిట్టూరోడి పుస్తకం( నామిని రచనలన్నీ కలిపి వేసిన సంపుటి) మూడో ముద్రణ ఎప్పుడు? అని అడిగా.-మూడు వేలు వేస్తున్నా- అన్నాడు. రేటెంత పెడుతున్నావు? అంటే, -ఇరై రూపాయలు బెట్టి..రాయలచెరువు బస్టాండ్లో పోసి మహా అద్భుతమైన పుస్తకం ..ఇరై..ఇరై..ఇరై రూపాయలే అని అరిస్తే ఎవురన్నా వొచ్చి కొంటారా.. వొక్కడికే లక్షకి అమ్మెయ్యాల. .అదీ.- అన్నాడు కసిగా. -నేను సన్మానానికి గూడా వొగదెగింది అందుకే- అన్నాడు కాసేపాగి. తిరుపతిలో ఎంత పెద్ద మీటింగు జరుగుతున్నా తొంగి కూడా చూడని ఈ మనిషిని పాతికేళ్ళ పండగ చేసి సన్మానించేదానికి సాకం నాగరాజ, దుర్గాప్రసాద్‌ ఎట్లా వొప్పించారో అర్ధమైపొయ్యింది. సి నారాయణ రెడ్డి విసి గా ఉండగా నామిని మునికన్నడి సేద్యం పుస్తకానికనుకుంటాను అవార్డు ప్రకటించారు. పేపర్లో ఆ వార్త చూసి , -నేను ప్రభుత్వ వ్యతిరేకిని మీ అవార్డు నాకొద్దు - అని విసురుగా ఉత్తరం రాసాడు నామిని. అది గుర్తొచ్చి ,నామినీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వస్తే తీసుకుంటావా అనడిగా. -చీ దరిద్రం- అన్నాడు ఠకీమని. ఏం అంటే, -అదెంత ఇరైఅయిదు వేలు- అన్నాడు. చిక్కడపల్లి- సందులో సంఘం- అవార్డు అని చెప్పి పదిలక్షలు ఇస్తామంటే తీసుకుంటావా అనడిగితే, -ఎందుకు తీసుకోనూ.. డబ్బు ఇంపార్టెంట్‌ - అన్నాడు. కథలు రాయాలని నీకెందుకు అనిపించింది నామినీ అనడిగితే ఒక కత చెప్పాడు.-1980లో బిఎస్సీ ఫైనలియర్‌ పరీక్షలు రాస్తుండా. మా మిట్టూరు నుంచి తిరప్తికి ఇప్పుడున్నన్ని బస్సుల్లేవు. పొద్దన ఎనిమిదికే పరీక్ష. ముందు రోజు సాయంత్రం బస్సులోనే తిరప్తికి చేరుకోవాల . ఎవురో వొకరి రూములో ఉండి మర్రోజు పరీక్ష రాసి రావాల. సాయంత్రం బస్సెక్కినా. కండెక్టర్‌ పక్క సీట్లో కుచ్చున్నా. అక్కడైతే పైన లైటుంటాది. చదువుకుంటా వుండా. మధ్యలో హఠాత్తుగా బస్సాగింది. చూస్తే, ఒక మాలాయనకి నుదిటి మీద దెబ్బ తగిలి నెత్తురు కారతా వుంది. మా పక్కూరి రెడ్డి ఎగిసి తన్నాడు, -లమ్డీ కొడకా.. రైతులు , సంసారులు ఎక్కే బస్సులో గొడ్డు మాంసం తెస్తావా..- అని తిడతా ఉండాడు. వొక్కరూ ఇదేమని అడ్డుబోలా. ఆ మాలాయన గూడా -..అనా . .అనా... నా కూతురు గర్బంతో వుండాదినా..- అన్నాడు చిన్నగా. నాకు దుఖం వచ్చేసింది. చెంద్రగిరి దెగ్గిర్లో ఆయన కూతుర్నిచ్చాడు. జబ్బు తగిలి చచ్చిపొయిన ఎనుముని కోసి బాగాలేశారు. గర్భంతో ఉన్న కూతురు మాంసం కూర తింటే మంచి ఆరోగ్గెం కదా అని తీసుకోని పోతా ఉండాడు. యూనివర్శిటీలో కుచ్చోని దీన్ని కతగా రాసి ఆంధ్రప్రభకి పంపిచ్చా. తిరిగొచ్చింది. ఇంక అక్కణ్ణించి అదే పని, కేంపస్‌లో యాడ్నో వొక చెట్టు కింద కుచ్చోని నాకు తెలిసిన వన్నీ రాయడమే. బలే ఎక్సర్‌సైజు.- ఈ లెక్కన పచ్చనాకు సాక్షిగాకి ముందు నీ కథలు చానానే ఉండాల్నే, అంటే -అచ్చయింది వొక్కటే -మళ్ళీ జన్మించు మహాత్మా- అని ఆంధ్రప్రభలో పడింది- అన్నాడు.పచ్చనాకు జెండా ఉదయం దిన పత్రికలో ఎడిటోరియల్‌ పేజీలో సీరియల్‌ గా పచ్చనాకు సాక్షిగా కథలు అచ్చవుతుంటే ఎవరీ నామిని సుబ్రహ్మణ్యం నాయుడు అని అంతా బిత్తరపొయ్యారు. ప్రతి కథలో తమని తాము వెతుక్కుని గుండె తడి చేసుకున్నారు. బాల్యాన్ని తడుముకున్నారు. పరమ పచ్చిగా పల్లె జీవితం .. దరిద్రం.. అమ్మా బిడ్డల ప్రేమానుబంధం,, తిరుపతి మాండలికం. సంక్షిప్తంగా, సరళంగా సాగే ఈ కథలు తెలుగు సాహిత్యాన్ని ఒక ఊపు ఊపాయి. అప్పటి అనుభవాలు చెప్పు నామినీ అనడిగితే, తడుముకోకుండా మొదలు పెడతాడు.-పచ్చనాకు సాక్షిగా అనే పేరు నేను పెట్టలేదు. ఎబికె పెట్టాడు. నేను పచ్చనాకు సత్తెంగా అని రాసా. మా వూళ్ళో ఇట్నే అంటారు సా.. అంటే, -అందరికీ అర్ధం కావాల గదా- అన్నాడు. నా పేరు గూడా నామిని సుబ్రమణ్యం నాయుడు అని రాస్తే, -ఘనంగా ఉండాలిరా అబ్బాయ్‌- అని సుబ్రహ్మణ్యం నాయుడు అని పెట్టాడు. -నీ కథలు చిత్తూరు జిల్లా వాళ్ళకి గూడా అర్ధం కావడం లేదంట- అంటా వచ్చాడు ఎబికె రెండో వారంలోనే. ఆయన ఫ్రెండు ఎవురో అయ్యేయస్‌ ఆఫీసర్‌ చిత్తూరు జిల్లా అయన చెప్పాడంట. సార్‌.. నాలుగు నెల్లు దయచేసి నన్నాపకండి. అప్పటికీ అర్తం కాకపోతే అప్పుడు ఆపెయ్యండి అని చెప్పా. పతంజలి, మృణాళిని, వసంతలక్ష్మి .. వీళ్లందురూ గూడా మొదుట్లో యేం అర్తం గాక చూస్తా వుండే వాళ్లు. వసంతలక్ష్మి అనేది, -ఎంత సేపూ సద్ది సమస్యేనా ఇంకోటి రాయవా- అని. నిజమే, పచ్చనాకు సాక్షిగా లో కతలన్నీ సద్ది కూడు మీదే నడస్తాయి. చిన్నప్పుడు పిలకాయలకి కూటి యావ ఎక్కువ. చెట్లమ్మడి పుట్లమ్మడి పరిగెత్తతా తిరగతా వుంటారుగదా ఆకిలెక్కువ. ఆ అర్జ్‌ .. అదే పచ్చనాకుసాక్షిగాలో కనిపిస్తుంది.- అని ఆ కతల ఆత్మని విప్పాడు. అప్పటిదాకా తెలుగు సాహిత్యంలో అంతగా వాడని పదాల్ని యధేచ్చగా వాడేశావు గదా, అంత ధైర్యం ఎట్లా వచ్చింది? అని అడిగితే,అప్పటిదాకా రైతు రచయితలుగా చెలామణి అవుతున్న వారిమీద ఉన్న కసి అన్నాడు. -పచ్చనాకు సాక్షిగా తొలి కత లోనే నా బట్టా అని రాసా. అది అంత యిచిత్రమైన పదమని నాకేం అనిపించలా, మా మిట్టూర్లో చిన్నా పెద్దా అందురూ మాట్లాడే మాటే అది. అసలు నా బట్టా అనే మాట పలక్కుండా వొక పల్లెటూరి ఆడమనిషి కేరెక్టర్‌ని ఎవురైనా ఎట్లా రాస్తారు? కానీ అప్పటిదాకా వొక్కరన్నా రాశారా? -నా బట్టా దేవుడా.. ఏమిరా యిట్టా వుడకాడిపిస్తా వుండావు- అని నేను రాస్తే, దేవుడ్ని గూడా నా బట్టా అని రాశావే అని యిచిత్రపొయినారు. చిత్తూరు మొదులుకోని శ్రీకాకుళం దాకా నా బట్ట అనే పదం ఉందని నాకు ఇప్పుడు గదా తెల్సింది. మర్యాదకి పొయ్యి మనుషులు మాట్లాడుకునే భాషనే మార్చి రాసేసారు. మాండలికం అని మనమనుకుంటాం గానీ, చిన్న చిన్న పదాలు తప్ప కొద్ది తేడాలతో సమస్తమూ ఒకటే- అంటాడు నామిని నిండు గుండెతో. -మర్యాదగా వుండదనీ, అర్ధం కాదనీ చానా మంది డెలీట్‌ చేసేసుకుంటారు. వాసిరెడ్డి నవీన్‌ ఏమనుకుంటాడో, యింకొకరు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు. ప్రజల కమ్యూనికేషన్‌ అద్భుతం. అది మనం పట్టుకోగలగాల. నేను మర్యాదల గురించి ఆలోచించలా. మా వూళ్ళో ఆడోళ్ళకి అర్తమవతాదా లేదా అని ఆలోచించా. వాళ్ళతో కమ్యూనికేట్‌ గాకపోతే రాసేదంతా వేస్ట్‌. పచ్చనాకు సాక్షిగా గానీ, సినబ్బకతలుగానీ, మిట్టూరోడి కతలుగానీ అంతా ఆడవాళ్ళ గొడవే- అని చెబుతూ, -పతంజలిని గానీ, రావిశాస్త్రిని గానీ, కాళీపట్నంని గానీ, కేతు విశ్వనాధరెడ్డిని గానీ, కేశవరెడ్డిని గానీ, సింగమనేని నారాయణని గానీ ఆడోళ్ళు చదవలేరు- అంటాడు. అని అంతటితో వూరుకుంటాడా, -చలం, రంగనాయకమ్మ తర్వాతగ్రామీణ జీవితం అయినా సరే ఆడవాళ్ళు మా మిట్టూరోళ్ళను అంతగా ఆదరించారు అని సంతోషిస్తాడు. అయితే, సీమ కథల్లో నామిని కథ ఎందుకు వెయ్యలేదు సార్‌ అని సింగమనేని నారాయణని అడిగితే, నామిని కధలెక్కడ రాశాడు..అని అమాయకంగా ప్రశ్నిస్తాడు ఇప్పటికీ. ఎందుక బ్బా ..పొగురు మాటలతో అందరికీ దూరమై పోతావు అని నామినిని అడిగితే, -నేను వూరికే పై పైన మాట్లాడ్డంలా. వీళ్ళందర్నీ నేను చదివినాక , రెక్కల కష్టం చేసిన వాడిగా నాకు అర్తమైంది ఏమంటే.. వీళ్ళెవురూ రైతులగురించి నిజం రాయలేదు. రైతుల మింద కతలల్లారు నా బిడ్డల మింద ప్రమాణం చేసి చెబుతున్నా.. ఈ రచయితలంతా రైతుల్ని, రైతుల భార్యల్ని, రైతుల బిడ్డల్ని హింసలు పెట్టారు.. అంతా జూటా రాతలు.. దాసరి నారాయణరావు దర్శకత్వం టైపు. ఇంకా చెప్పాలంటే ,-కళా తపస్వి- విశ్వనాధ్‌ టైపు ఉదాహరణకి కేశవరెడ్డి మూగవాని పిల్లనగ్రోవి, చివరిగుడిసె.. ఆయన రాసిన కొన్ని పుస్తకాల్లో ఏ రైతుల్ని వాళ్ళ మానాన వాళ్లని బతకనిచ్చాడు? అంతా హింసే.. కళాతపస్వి అని ఎందుకంటున్నానంటే, సాగరసంగమంలో కమలహాసన్‌ బావి గట్టు మింద చేసే నృత్యానికీ... రాత్రి వొంటి గెంట కాడ జోరున వాన కురస్తా వుంటే, వొక రైతు కొట్టంలోంచి ఎద్దుల్ని పట్టుకోని బొయ్యి అంత వానలో మోకాట్లోతు నీళ్ళలో గెంట సేపు మడక దున్నేసి పొంఢ్లు గిటక్కరుచుకుని చచ్చిపోడానికి తేడా లేదు. కేశవరెడ్డి వంటి రచయితలకి నేను దణ్ణం బెట్టి, రైతుల తరపున వాళ్ళ కాళ్ళు పట్టుకుని నేను చెప్పేదేమంటే, మీరు మునెమ్మ అయినా రాయండి, యజ్ఙం అయినా రాయండి , సింగమనేని నారాయణ మాదిరిగా సెప్టెంబర్‌ పదకొండు అను... అని ఇంకేందో అయినా రాయండి. అచ్చయ్యే ముందు ఎడిటర్లకు గాకుండా, రైతులకీ, రైతు భార్యలకీ నలగరికైనా చదివి వినిపించండి. రైతు సాహిత్యం చేరా లకోసమో, ఓల్గాల కోసమో, వాసిరెడ్డి నవీన్‌ల కోసమో ఉండకూడదు. రైతు సాహిత్యం రైతులకీ రైతులని గురించి ఆలోచించే వాళ్ళకీ వొక బైబిల్‌ మాదిరిగా వుండిపోవాలి . అని ఉపన్యాసానికి తగులుకుంటాడు నామిని. ఇంక రైతు భాషని గురించి .. లం.. అని రాసి రెండు చుక్కలు బెడతారు. జ పెడితే తప్పేముంది? నా బట్టా అనే మాట సాహిత్యంలోకి రాకపోతేసౌందర్యం ఏముండాది?- అని నిలదీస్తాడు నామిని.అంతటితో ఆగుతాడా.. - పీలేరులో ఒక స్కూలికి పొయినా, అల్సేషన్‌ కుక్కలు తెలివైనవా, వీధి కుక్కలు తెలివైనవా అని అడిగా, పిలకాయలు టకీ మని చెప్పినారు ఈది కుక్కలే సార్‌ అని, ఈ రచయితలంతా అల్సేషన్‌ కుక్కలు, నేను వీధి కుక్కని. అదీ తేడా-అని వివరిస్తాడు.నామినిలో చార్లీ చాప్లిన్‌ కనిపిస్తాడు. పచ్చనాకుసాక్షిగాలో పసి పిల్లాడిగా కన్నీరు పెట్టిస్తాడు. సినబ్బ కతల్లో పడీ పడీ నవ్విస్తాడు. మిట్టూరోడి కతల్లో పల్లె జీవన సంబంధాలని హాయిగా అందిస్తాడు. దరిద్రాన్ని తెలుగులో అప్పటికి చాలా మందే రాసినా, వాళ్ళంతా అందులోని దయనీయతనే రాసారు. నామిని దాంట్లోని సౌందర్యాన్నీ రాస్తాడు. బహుశా దీని వల్లే ఏమో శిష్ట్లా ఉమామహేశ్వరరావు అంటే పడిచస్తాడు. నామిని శైలిని ఆ తర్వాత తెలుగులో చాలా మందే అందుకున్నారు. అందర్నీ పాఠకులూ బాగానే ఆదరించారు. సోమరాజు సుశీల, ఖదీర్‌ బాబు, గోపిని కరుణాకర్‌, వంశీ, ఎండ్లూరి సుధాకర్‌, బత్తల ప్రసాద్‌ వంటి వారి కథలు పదే పదే నామినినే గుర్తుకు తెస్తాయి. మరీ ఖదీర్‌ దర్గామిట్ట కథలు. వీటికి టివి నైన్‌ సాంబు దర్గామిట్టూరోడి కతలు అని పేరు కూడా పెట్టాడు. - అసలు ఇదంతా నా ప్రతిభ కూడా కాదు అంటాడు నామిని. ఇంకా..- నా రెక్కల కష్టం. వొకటిన్నర ఎకరా రైతుకి పుట్టినాను కాబట్టే నేను ఈ కతలు రాయగలిగాను. ఐదారెకరాల రైతుకి పుట్టింటే.నా కతలు పచ్చి జూటా కతలయ్యేవి. వొకటిన్నర ఎకరాలోనే జీవితమంతా వుంటింది. దాన్ని యాజిటీజ్‌గా పట్టుకున్నాను. అదే నా కతల సౌందర్యం- అని ఫిలాసఫీ చెబుతాడు నామిని. నిజమే సౌందర్యమే కాదు, నామిని తిమురు కూడా అదే. ఆ తిమురు ఆయన కతల్లోనూ వుంది. ఆయన కతల్లోని మనుషుల్లోనూ ఉంది. ఆ మనుషులు మాట్లాడే భాషలోనూ వుంది. అసలా మిట్టూరు మట్టిలోనే వుంది. ఆ మట్టిని పిడికెడు జవురుకొచ్చి గుండెల్లో దాచుకోవాలనిపిస్తుంది.